Sun 11 Dec 00:36:46.109392 2022
Authorization
చంద్రవంక అనే అడవిలో చిట్టీ అనే కుందేలు ఉండేది. పాఠశాల ఎగ్గొట్టి తన స్నేహితులైన నక్క, కోతితో కలిసి అడవి మొత్తం తిరిగేది. చేతికి ఎదిగొస్తున్న కొడుకు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి సమాజంలో మంచి స్థానం పొందుతాడు అనుకున్న చిట్టీ ఇలా స్నేహితులతో కలిసి పాఠశాల ఎగ్గొట్టి తిరగడం చూసి తల్లి కుందేలు బాధపడేది.
చిట్టీ చదువుకోకుండా తిరగడం చూసి లోలోపలే కృంగి పోయేది. తన ఇంటిలో పని చేస్తున్న తల్లికుందేలుని చూసిన సింహరాజు ''ఏమైందీ! అలా దీనంగా ఉన్నావు. చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటు న్నావు' అని అడిగింది. ''ఏమీ లేదు మహారాజా! నా కొడుకు చిట్టీ స్నేహితులతో కలిసి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. పాఠశాలకు కూడా వెళ్ళటంలేదు. ఎక్కడికెళ్ళావ అని అడిగితే నాపైనే కోప్పడుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకును గారాబంగా పెంచుకున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడి జీవితం ఏమైపోతుందో'' అని కన్నీరు పెట్టుకుంది.
''చిట్టీని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆటలల్లో, చదువుల్లో చాలా చురుకుగా ఉండేవాడు. ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యాడు? వాడి స్నేహితులు ఎవరు? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు తెలసుకుని రా!' అని తన మంత్రియైన ఏనుగును పంపింది సింహం.
చిట్టీకి తెలియకుండా మంత్రి దాని కదలికలను గమనించి '' మహారాజా! తల్లి కుందేలు చెప్పింది నిజమే! చిట్టీ స్నేహతులు నక్క, కోతి. అవి అడివంతా తిరుగుతూ కనిపించిన పండ్లను తింటూ, దారిన వచ్చిపోయే వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారు'' అని సింహానికి చెప్పింది.
ఓ సారి పండ్ల కోసం చెట్టు ఎక్కిన చిట్టీ కాలు చెట్టు కొమ్మల మద్య ఇరుక్కుపోయింది. అది చూసిన కోతి ''ఓ చిట్టీ కొమ్మల్లో ఇరుక్కుపోయావా! ఎలా కిందికి వస్తావు ఇప్పుడు? రాత్రి ఇక్కడే ఉండిపో... చల్లగా ఉంటుంది.'' అని ఎగతాలిగా అన్నది. ''మిత్రులారా ! దూరం నుంచి ఎవరో వేటగాడు వస్తున్నట్లుంది. త్వరగా పైకి వచ్చి ఈ కొమ్మల మధ్యలో ఇరుకున్న నన్ను కాపాడండి! అని చిట్టీ బాధతో వేడుకుంది. వేటగాడిని చూసిన నక్క, కోతి 'మిత్రమా! బతికుంటే రేపు కలుసుకుందాం!' అని పరుగందుకున్నాయి.
''అమ్మ మాటలు వినకుండా, ఎంత వారించినా పాఠశాలకు వెళ్ళకుండా తిరిగి ఆమెను బాధపెట్టాను''అని మనసులో చిట్టి అనుకుంటుండగానే దూరం నుంచి బంటీ అనే పిల్ల ఏనుగు రావడం చూసి వేటగాడు పారిపోయాడు.
చిట్టీ దూరంగా వస్తున్న బంటీని చూసింది. కానీ ఎలా సహాయం అడగాలో అర్థం కాలేదు. చిట్టీ బంటీ ఇద్దరు బాల్య మిత్రులు. ఒకే తరగతి చదువుతున్నారు. మంత్రి ఏనుగు కుమారుడు బంటీ. చిట్టీ ఏదైనా తప్పు చేస్తే బంటీ వెంటనే ''అది తప్పు అలా చేయొద్దు మిత్రమా!'' అనేవాడు. అలా చెప్పడం నచ్చని చిట్టి బంటితో స్నేహం వదిలేసి నక్క, కోతితో స్నేహం పెంచుకుంది.
చిట్టీని చూసిన బంటి ''అయ్యో! మిత్రమా ఎంత ఆపద వచ్చింది'' అని తన తొండంతో కొమ్మల మధ్య ఇరుక్కున్న చిట్టీని కాపాడింది. కాలు విరిగి నడవలేకపోయిన చిట్టీని తన వీపుపై ఎక్కించుకొని తల్లి వద్దకు చేర్చింది. వైద్యుడు ఎలుగుబంటిని తీసుకొచ్చి కాలుకు కట్టుకట్టించింది.
మంచానికే పరిమితమైంది చిట్టీ. తల్లి కుందేలు ప్రతిరోజు సపర్యలు చేసేది. బంటీ కూడా పాఠశాల ఐపోగానే చిట్టీ దగ్గరికి వచ్చి పాఠశాలలో జరిగిన పాఠాలతో పాటు, పాఠశాలలో జరిగిన విషయాలన్నీ చెప్పేది. మూడు నెలలు గడుస్తున్న స్నేహితులు నక్క, కోతి రాలేదు. ''చెడు స్నేహం వద్దని అమ్మ ఎంత చెప్పినా వినలేదు. బంటీ నా మంచి కోరి నన్ను ఎప్పటికప్పుడు మందలించిన వాడిని నేను దూరం పెట్టాను. ఇప్పుడు బంటినే ప్రతిరోజు వచ్చి పాఠాలన్నీ చెప్పుతున్నాడు. నాకు వైద్యం చేయిస్తున్నాడని చిట్టీ తనలోనే బాధపడి 'బంటి నన్ను క్షమించూ!' అని అన్నాడు. ''ఆపదలో ఆదుకొనేవాడే అసలైన మిత్రుడు కదా! అంత మన మంచికే జరిగింది.'' అని బంటి ఏడుస్తున్న చిట్టీని ఓదార్చాడు.
కోలుకున్న చిట్టి బంటితో కలిసి పాఠశాలకు వెళ్ళి బాగా చదువుకునేది. నక్క, కోతికి దూరంగా ఉన్నది. చిట్టీలో వచ్చిన మార్పుకు తల్లి కుందేలు సంతోషించి సింహరాజుకి, మంత్రి ఏనుగుకి, బంటీకి కృతజ్ఞతలు చెప్పింది.
- ముక్కాముల జానకీరామ్, 6305393291