Sun 25 Dec 00:46:08.826334 2022
Authorization
ఓ పశువుల కాపరి గుంపులోంచి ఓ మేక పిల్ల తప్పి పోయింది. అది ఓ ముళ్ల పొదలో ఇరుక్కుపోయి అరుస్తూ ఉంది. అప్పటికే చీకటి పడుతోంది. అది అరుస్తూనే ఉంది. ఆ పొదకు సమీపానే ఓ చెట్టు పై కోతి చూసి ''అలా గట్టిగా అరవకు ఇప్పుడు పులి వచ్చే సమయం అయింది. అది నిన్ను చూసింది అంటే ఇక అంతే. అరవకుండా జాగ్రత్తగా ఉండు'' అంది.
పులి అనగానే దాని ప్రాణాలు పోయినట్లు అనిపించింది.
''ఎలాగైనా నన్ను కాపాడవా'' అని ప్రాధేయ పడింది.
''ఆ ఆలోచన తోనే ఉన్న. ఈ రోజు ఆ మాయదారి పులి ఇటు రాకుంటే నువ్వు అదష్టవంతుడివి. ఉదయం మా పరివారంతో నిన్ను కాపాడతాను. అప్పుడు బైట పడుదువు గాని'' అని ధైర్యం చెప్పింది. కానీ తలవని తలంపుగా పులి గాండ్రింపు వినపడింది. అది వినగానే సర్రున చెట్టెక్కింది కోతి.
''ఇప్పుడెలా'' అంది మేక.
కోతి ఆలోచించి నేను ఓ కర్రకు పదునైన ముళ్ళు తగిలిస్తాను. అది నీ మీదికి దూకే లోగా నీవు చాకచక్యంగా ఆ కట్టేను దాని నోటికి తగిలించు. అది ముళ్ళు గుచ్చుకుని ఎటో పోతుంది'' అని కర్రను అందించింది మేకకు.
పులి అలికిడి కాగానే రెండూ అదిరిపడ్డాయి. మేక అతి కష్టంతో కాలి సందులో కర్రను పెట్టుకుంది.
పులి రానే వచ్చింది. చెట్టు పైనున్న కోతి దైవాన్ని ప్రార్థిస్తోంది. పులి దగ్గర అవుతోంది. చీకటిలో మేక కళ్ళు గోళీలుగా కనిపిస్తుంటే ఒక్క ఉదుటున దాని మీదకి దూకింది పులి.
వెంటనే మేక దాని మూతికి కర్రను తగిలించింది. పదునైన ముళ్ళు నోటికి గుచ్చుకుని రక్తం కారుతుంటే వెనక్కి మరలింది. చెట్టుపైనున్న కోతి కళ్ళు తెరచి చప్పుడు లేకుండా రెండు చేతులతో తప్పట్లు కొట్టింది.
ఆ మర్నాటి ఉదయమే దాని పరివారమంతా కలసి ఆ పొదలో ఉన్న మేకను విడిపించి దాని కాలిని శుభ్రపరచి ''నీ యజమాని దగ్గర దిగబెడతా పద'' అని మేక పై కూర్చుంది.
మేక సంతోషంతో అరచుకుంటు ఇంటికి చేరింది. అప్పుడే లెక్క పెడుతున్న కాపరి, తప్పిపోయిన మేక కనపడేసరికి సంతోషం పట్ట లేకపోయాడు.
దానిపైనున్న కోతిని చూసి మరింత ఆశ్చర్య పోయాడు. ఆ కోతే తన మేకను కాపాడింది అని తెలుసుకుని, మేకను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, కోతి తల నిమిరాడు.
- కనుమ ఎల్లారెడ్డి, 93915 23027