Sun 01 Jan 01:55:22.377963 2023
Authorization
రాజావారు పొద్దున్నే నిద్దర లేచారు. నిద్దర లేచిన రాజావారు బాల్కనీలోకి వచ్చారు. బాల్కనీలోకి వచ్చిన రాజావారు పెద్ద కుర్చీలో కాలుమీద కాలు వేసుక్కూచున్నారు ఎప్పటిలాగే. ఎప్పటిలాగే చుట్ట వెలిగించారు. ఎప్పటిలాగే గుప్పుగుప్పు పొగలు వదలసాగారు.
సూర్యుడు పొద్దున్నే నిద్దర లేచాడు. నిద్దర లేచిన సూరీడు ఆకాశంలోకి వచ్చేడు ఎప్పటిలాగే. ఆకాశంలోకి వచ్చిన భాస్కరుడు అలా స్టడీగా నిలబడి కిరణాలని విసిరేద్దామనుకున్నాడు ఎప్పటిలాగే. ఎప్పటిలాగే ఎరుపు నుంచి తెలుపుకు మారదామనుకున్నాడు. ఎప్పటిలాగే మండి పడదామనుకున్నాడు.
కానీ రాజు తల్చుకుంటే చుట్టలకు కొదువా చుట్టవెలిగిస్తే పొగలకు కరువా. రాజావారి చుట్ట పొగలు ఆకాశం దాకా వస్తుండటంతో ఎప్పటిలాగే పొగలు మబ్బులుగా మారుతుండటంతో ఎప్పటిలాగే ఆకాశంలో అడ్రసు లేకుండా పోయేడు సూరీడు.
రాజావారి ఆంతరంగికుడు రానే వచ్చాడు. ఎప్పటిలాగే చేతులు కట్టుకు నిలబడ్డాడు ఎప్పటిలాగే నమస్కరించాడు. ఎప్పటిలాగే ఓ దగ్గు దగ్గి నోరు విప్పాడు.
ధర్మప్రభువులు పొద్దున్నే చుట్టందుకున్నారు. పొగలు మబ్బులవుతున్నాయి. ఎప్పటిలాగే నల్లమబ్బులు కురుస్తయి. ఎప్పటిలాగే నగరంలో నాలాలు పొంగి పొర్లుతయి. కాలనీలు తడిసి ముద్దయితయి. డ్రైనేజీలు పొంది రోడ్లు కంపు కొడతయి. జంక్షన్లు జామవుతయి. ట్రాఫిక్ చేంతాడవుతుంది. దారంట పోయే మనుషుల తిట్లూ శాపనార్థాలూ తమకు అవసరమా అన్నాడు ఎప్పటిలాగే.
పాత అలవాట్లు ఓ పట్టాన చావవు అన్నారు గదోరు. నా చుట్ట పొగతో భగీరథుడినవుదామనుకున్నా సరే ఈ పూటకి ఆర్పేస్తానంటూ రాజావారు చుట్ట పీక కొరికి పారేశారు. తరువాత కళ్ళు ఆర్పుతూ తల ఎగరేస్తూ చేతులూ కాళ్ళూఝాడిస్తూ ప్రజలు ఏమనుకుంటున్నారోరు మా పరిపాలన గురించి 'లైకు'లెన్నో చెప్పు అనడిగారు ఎప్పటిలాగే.
ఏం చెప్పమంటారు ప్రభూ. కొందరు తమరి ఊకదంపుడు ఉపన్యాసాలకు మొహం మొత్తుతుందన్నారు ఎప్పటిలాగే. ఎప్పటిలాగే మీ పథకాలన్నీ ఉప్పు మూటలని క్షమించాలి ఎప్పటిలాగే మీ హామీలన్నీ నేతి బీరలనీ అంటున్నారు. కొంతమందైతే ఉట్టికెగరలేని పిల్లి స్వర్గానికి ఎగురునా? అని ఎద్దేవా చేస్తున్నారు. మీరిలాగ ఎప్పటిలాగ పెద్ద కుర్చీలో కూర్చుని నింపాదిగా ఎప్పటిలాగే చుట్ట కాల్చుకొను వీలులేదంటున్నారు అన్నాడు ఆంతరంగికుడు ఎప్పటిలాగే సవినయంగా.
రాజావారు కనుబొమలు ముడిచారు ఎప్పటిలాగే అయితే యిక ఏదో ఒకటి చెయ్యాల్సిందేనన్న మాట. ఏం చేద్దాం? ధనవంతుల్ని పేదవాళ్ళని చెయ్యటం మన వల్ల కాదు గదా పేదవాళ్ళని ధనవంతుల్ని చేసి పేరూ ప్రఖ్యాతీ కొట్టేద్దామా ఎప్పటిలాగే అన్నాడు.
ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేయవచ్చు కానీ పేదవాళ్ళని ధనికుల్ని చేయడం అసాధ్యం ప్రభూ. ఎప్పటిలాగే వాళ్ళని మరింత పేదల్ని చేయడం సులువు అన్నాడు ఆంతరంగికుడు.
అదెలాగో నువ్వు చెప్పేది నా బుర్రకు తాకడం లేదన్నారు రాజావారు ఎప్పటిలాగే. ఏదీ మొదటిసారి అర్థం కాకపోవడంతో ఎప్పటిలాగే.
చిత్తం ప్రభువుల వారు చిత్తగిచాలి పేదవాళ్ళకు ఉచితంగా బియ్యం ఇచ్చామనుకోండి ఎప్పటిలాగే. సంపాదించినదంతా తాగితందనాలాడి మరింత బీదోళ్ళవుతారు. ఆ పేరా ఈ పేరా భరణాలిచ్చామనుకోండి బద్ధకస్తులవుతారు. పని దొంగలవుతారు. పనీ పాటా లేని వాళ్ళు మన మీదే ఆధారపడి ఉండేవాళ్ళు మనం చెప్పిందే వేదం అని నమ్ముతారు. పేదరికమే మనకు రక్ష పేదవారే మనకు అండాదండా. పేదరికం అనేదే లేకుండా చేస్తే రాజ్యం ఉండదు. రాజ్యం ఉండకపోతే ఎప్పటిలాగే రాజులూ ఉండరు అన్నాడు ఎప్పటిలాగే ఆంతరంగికుడు.
అర్థమయిందోరు పేదవాళ్ళ సంగతి వదిలేద్దాం. సోలెడు బియ్యం గ్లాసెడు మద్యం దోసెడు రూకలు సొరకాయ కోతలు చాలు వాళ్ళకి. ఎప్పటిలాగే ఇప్పుడు మనం ధనికుల్నే పేదలనుకుని వారిని మరింత ధనవంతుల్ని చెయ్యాలి కదా ఎప్పటిలాగే. అదే కదా ఎప్పటిలాగే చిదంబర రహస్యం అన్నారు రాజావారు ఎప్పటిలాగే.
ఆహా ప్రభువుల వారి బుర్ర ఎప్పటిలాగే పాదరసం తమరు ప్రకటించారే ఆ దీనబంధు పథకం తక్షణమే ప్రవేశపెట్టండి దీనాతి దీనులెందరో మీ కోసం క్యూలో నిలబడ్డారు ఎప్పటిలాగే అంటూ ఆంతరంగికుడు గంట మోగించాడు ఎప్పటిలాగే.
ఒక మనిషి లోపలికి వచ్చాడు. వేళ్ళకు ఉంగరాలున్నాయి. మణికట్టును బ్రాస్లెట్టు చుట్టుకునుంది. మెడలో శివుడి పామంత మందం ఉన్న గొలుసుంది. అన్నీ బంగారువే ఎప్పటిలాగే.
ప్రభూ తమరే దయ చూపాలి అన్నాడా మనిషి వేళ్ళకున్న వుంగరాల్లో రాళ్ళు మెరుస్తుంటే ఎప్పటిలాగే.
ఎవరు నువ్వు. నీ కష్టం చెప్పుకో. ఆర్చేవాడ్నీ తీర్చేవాడ్నీ నేనే కదా అన్నారు రాజావారు ఎప్పటిలాగే కాలుమీద కాలువేసుక్కూచుని.
ప్రభూ నేను రైతుని. పేద రైతుని. నిరుపేద రైతుని. తమరు దయ చూపాలి ఎప్పటిలాగే అన్నాడు వచ్చినవాడు.
దీనబంధు పథకం కింద డబ్బు కావాలంటావు అంతే కదా! అన్నారు రాజావారు ఎప్పటిలాగే ఠీవిగా.
అవును ప్రభూ. నేను పేదవాడ్ని. నా అంగరక్షకులు పేదవారే. నా నాలుగు కార్ల డ్రైవర్లు పేదవారే. నా ఇంట్లో పని మనుషులు పదిమందీ పేదవారే.
దీనబంధు పథకం సంగతి తెల్సు కదా ఎకరాకి ఐదువేలు. నీకెన్ని ఎకరాల భూమి ఉంది అన్నారు రాజావారు ఠీవిగా ఎప్పటిలాగే కాళ్ళూపుతూ.
ఎంత ప్రభూ కేవలం ఆరువందల ఎకరాలు మాత్రమే దీనబంధు పథకం కింద ఎప్పటిలాగే.
మీకు రావాల్సిన సొమ్ము మీకు ఎప్పటిలాగే అందుతుంది. బయట ఇంకెవరెవరున్నారు అన్నారు రాజావారు.
ఐదు వందల ఎకరాల భూమి ఉన్న నటుడున్నాడు. పదిహేను కాలేజీల యజమాని ఉన్నాడు. కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారి ఉన్నాడు. తమరి ఆస్థాన మంత్రులు కూడా ఉన్నారు ప్రభూ. ఆ దీనులందరికీ తమరే దీనబంధు పథకం అమలు చేసి ఎప్పటిలాగే ఆదుకోవాలి అన్నాడు ఆరు వందల ఎకరాలున్న పేదరైతు.
అయ్యయ్యో నా రాజ్యంలో ఇంత దీనులు ఇంత కటిక పేదలు ఉన్నారా. అందరికీ దీనబంధు అమలు చేస్తాం. ప్రవేశపెట్టండి రాజావారు అన్నారు ఎప్పటిలాగే.
చిత్తం అన్నాడు ఆంతరంగికుడు గంట చేత్తో పట్టుకుని ఎప్పటిలాగే!!
- చింతపట్ల సుదర్శన్, 9299809212