Sun 01 Jan 01:58:02.332435 2023
Authorization
ఒక రాజ్యంలో ఒక రాజుండేటోడు. ఆయనకు ఒక రోజు మూర్ఖులంటే ఎట్లా వుంటారో చూడాలి అనుకున్నడు. వెంటనే మంత్రిని పిలిపించి ''నాకు మూర్ఖులు ఎట్లా వుంటారో చూడాలని వుంది. నువ్వెట్లాగైనా సరే వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రానికల్లా మూర్ఖులని పట్టుకోనిరా'' అని ఆజ్ఞాపించాడు.
రాజు సెప్పినంక సేయకపోతె బాగుండదు గదా అనుకుని మంత్రి మూర్ఖులను వెతకడం కోసం బయలుదేరిండు. వెదుకుతు పోతావుంటే తొవ్వెంట ఒకడు చెట్టు కింద ఏదో వెదుకుతూ కనబడ్డడు.
మంత్రి వాని దగ్గరికి పోయి ''ఏంరా... ఏం పోయింది? ఎందుకు వెదుకుతున్నావు'' అని అడిగినాడు.
దానికి వాడు ''నా లగ్గం రోజు మా అత్త మామ పెట్టిన బంగారు ఉంగరం పడిపోయింది. దాని కోసం వెదుకుతున్న'' అన్నడు. అప్పుడా మంత్రి ''అట్లాగా! ఉంగరం యాడ వోయింది' అడిగిండు. దానికి వాడు దూరంగా వేలు చూపిస్తూ ''అదిగో అక్కడ చెట్ల మధ్యనున్న ముండ్ల కంపల పడిపోయింది'' అన్నాడు. దానికి మంత్రి ఆశ్చర్యపోతూ.... ''ఉంగరం అక్కడ ముండ్ల కంపల పడిపోతే, మరి నువ్వేమి ఇక్కడ చెట్టు కింద వెదుకుతూన్నావ్?'' అడిగాడు.
దానికి వాడు కోపంగా ''అక్కడంతా ముల్లులు ఎట్లా వున్నాయో చూడు. దానికి తోడు ఎండ సుర్రుమంటోంది. ఆ ఎండలో ముండ్ల మధ్య వెదకడం కన్నా చల్లగా ఈ చెట్టు నీడన వెదకడం మేలు గదా!'' అన్నాడు.
వస్తువు పోయిన చోట వెదుక్కోకుండా వేరొకచోట వెదుకుతూ వున్న వాణ్ణి చూసి మంత్రి ''హమ్మయ్య! ఒక మూర్ఖుడు దొరికాడు'' అని లోలోపల నవ్వుకోని ''వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజభవనానికి రా, రాజుకి నీ తెలివి తేటల గురించి చెప్పి ఇంతకంటే మంచి ఉంగరమిప్పిస్తా'' అన్నాడు. వాడు సరేనని తలూపినాడు.
మంత్రి ఇంకో మూర్ఖుని కోసం వెదుకుతూ పోసాగినాడు. అట్లా పోతా వుంటే ఒకడు నెత్తిన గడ్డిమోపు పెట్టుకుని, గుర్రమ్మీద కూసోని వస్తున్న వాడు కనబడినాడు. వాన్ని చూసి మంత్రి ''గడ్డిమోపు గుర్రమ్మీద పెట్టుకోని రాకుండా నెత్తిమీద పెట్టుకోని వస్తున్నావ్ ఏంది నీ సంగతి?'' అని అడిగినాడు.
దానికి వాడు ''ఏం చెయ్యమంటావ్ మహామంత్రీ...! గుర్రం ముసలిదయిపోయింది. నన్ను మోయడానికే దానికి శక్తి లేదు. ఇంక గడ్డిమోపునేం మోస్తది. అందుకే దాని మీద బరువు పెట్టకుండ నేనే గడ్డిమోపు నెత్తిన పెట్టుకున్న'' అన్నాడు.
గడ్డిమోపు నెత్తి మీద పెట్టుకున్నా గుర్రమ్మీద పెట్టుకున్నా ఒకటేనని తెలియని వాడి మూర్ఖత్వానికి మంత్రి ఆచ్చర్యపోయి హమ్మయ్య! మరో మూర్ఖుడు దొరికాడని లోపల్లోపల నవ్వుకుని ''వచ్చేనెల ఒకటో తేదీ సాయంత్రం రాజు గారి వద్దకురా, నీ తెలివి గురించి చెప్పి రాజుతో మంచి బహుమతిప్పిస్త'' అన్నాడు. వాడు సరేనన్నాడు.
మంత్రి ఇక ముచ్చటగా మూడో మూర్ఖుని కోసం వెదుకుతూ పోసాగినాడు. అట్లా పోతావుంటే ఒకరోజు ఒకచోట ఇద్దరు కిందా మీదా పడి కొట్టుకుంటూ కనబడ్డారు. అది చూసి మంత్రి వాళ్ళిద్దరినీ విడిపిచ్చి ''ఎందుకట్లా కొట్లాడుక్కుంటు న్నారు? ఏంది మీ బాధ?'' అని అడిగినాడు.
దానికి ఒకడు కోపంగా ''చూడు మంత్రీ...! వీడు నా బంగారంలాంటి బర్రెను చంపుతానంటున్నాడు'' అన్నడు. మంత్రి రెండోవానివైపు చూసేసరికి వాడు కోపంగా ''ఆయన దొంగ బర్రె నా తోటంతా తిని పాడు చేస్తే ఎట్లా వూరుకునేది. అందుకే చంపుతానంటున్న'' అనిండు.
మంత్రి కాసేపాలోచించి ''ఇంతకీ నీ తోట యాడుంది ?'' అన్నడు. దానికి వాడు ''తోటనా..... ఇంక ఎయ్యలేదు గదా'' అన్నడు.
ఆ మాటలకు మంత్రి ఆచ్చర్యపోయి, రెండోవానికెళ్ళి తిరిగి ''మరి నీ బర్రేది? అన్నడు. దానికి వాడు ''ఇంక నేను కుడా కొనలేదు గదా!'' అన్నడు. మంత్రి ఆ ఇద్దరి మాటలకు మరింత ఆశ్చర్యపోయి ''నువ్వు తోటా ఎయ్యలేదు. వాడు బర్రె కొనలేదు. మరెందుకు ఇద్దరూ కొట్లాడుకుంటూ వున్నారు'' అని అడిగిండు. దానికి ఒకడు ''నేను మా యింటి పక్కనే తోట ఎయ్యాలనుకుంటున్న, వానిది మా పక్కిల్లే. వాడు బర్రెను కొనాలి అనుక్కుంటున్నడు. ఆ బర్రె పక్కనే వుంటది గదా! అది నా తోటలోనికి వచ్చి పాడు చేస్తాది గదా'' అన్నడు. వాళ్ళిద్దర్ని చూసి మంత్రి మరింతగా నవ్వుకుని హమ్మయ్య! ఈసారి ఏకంగా ఇద్దరు మూర్ఖులు దొరికారని సంబరపడి ''వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజు గారి వద్దకు రండి. రాజుకు మీ గురించి చెప్పి మీ తగవు తీరుస్తా'' అన్నడు. వాళ్ళు సరేనన్నారు.
మంత్రి అట్లా పోతావుంటే ఒకచోట ఒకడు ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తున్నాడు . మంత్రి వాన్ని చూసి ''ఎందుకట్లా ఆకాశం దిక్కు చూస్తూ ఏడుస్తున్నావు? ఏంది నీ బాధ?'' అని అడిగాడు.
దానికి వాడు ఏడుస్తూ ''ఏం చెప్పమంటావు మహామంత్రీ! పోయిన్నెల నా మిత్రుడొకడు తీర్థయాత్రలకని పోతా పోతా ఒక చెంబు దాయమని, దాని నిండా బంగారు వరహాలిచ్చి పోయినాడు. రాత్రిపూట దొంగలు వస్తే కష్టం గదా అనుకుని .... అర్ధరాత్రి ఎవరూ చూడకుండా ఈ అడవిలో ఒక గుంత తీసి దాచిపెట్టిన. గుర్తు కోసం అని అంతా వెతికితే సరిగ్గా తవ్వే గుంత పైనే కొండమీద నల్లమేఘం పెద్దది కనబడింది. దాన్ని గుర్తు పెట్టుకున్న. నా దోస్తు వచ్చేది రేపే. వాని చెంబు వానికిద్దామని ఇక్కడికొచ్చి చూస్తే ఆ మేఘం కనబడత లేదు. ఎవడో బంగారు చెంబుతో పాటు గుర్తు పట్టకుండ మేఘాన్ని గూడా ఎత్తుకొని పోయినట్టున్నాడు. అందుకే యాడన్నా కనబడతాదేమోనని వెదుకుతూ వున్న'' అన్నాడు.
ఆ మాట విన్న మంత్రి ''ఎవడైనా గాలికి కదిలి పోయే మేఘాన్ని గుర్తు పెట్టుకుంటాడా మూర్ఖుడు కాకపోతే'' అని లోపల్లోపల నవ్వుకుని ''వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజు దగ్గరకు రా, రాజుకి చెప్పి నీ చెంబు, నీకిప్పిస్త'' అన్నాడు. వాడు సరేనన్నాడు.
ఇలా ఒకటో తేదీ సాయంత్రానికి వాళ్ళంతా రాజభవనానికి చేరుకున్నారు. మంత్రి వాళ్ళు చేసిన పనులన్నీ ఒక్కోక్కటి వివరించి చెబుతా వుంటే రాజు వాళ్ళ మూర్ఖత్వానికి కిందామీదా పడి పక్కున నవ్వాడు. ఇంతమంది మూర్ఖుల్ని చూసి, అందుకు వారికి పోగొట్టుకున్న ధనము, బంగారం అంతా ఇచ్చాడు. అతిగా సంతోషపడ్డాడు.
ఆ తర్వాత మంత్రి.... వాళ్ళతో పాటు ''మీరేమీ అననని మాటిస్తే నేను ఒక విషయం చెబుతా'' అన్నాడు.
'సరే చెప్పు' అని రాజు అనిండు.
''వాళ్ళతో పాటు మనం కూడా మూర్ఖులమే'' అన్నాడు.
అప్పుడు రాజు ఆచ్చర్యపోతూ.... ''మనిద్దరమా? అదెట్లా'' అన్నాడు.
అప్పుడు మంత్రి ''ఈ దేశాన్ని పరిపాలించాల్సిన మీరు, నేనే గదా....! మనం ప్రజల గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించాలి కానీ, ఇట్లా మూర్ఖుల గురించి ఆలోచిస్తే ఎట్లా? నెల రోజుల పాటు పరిపాలన గాలికి వదిలేసి మూర్ఖులను పట్టుకొని రమ్మన్న మీరొక మూర్ఖులు. అలా చెప్పగానే మారు మాట్లాడకుండా సరేనంటూ బయలు దేరిన నేనొక మూర్ఖుణ్ణి.'' అని అన్నాడు.
ఆ మంత్రి మాటలకు రాజు నిజం తెల్సుకుని చిరునవ్వుతో మంత్రి భుజం తట్టి మెచ్చుకున్నాడు. అంతే కాకుండ మిగతా మూర్ఖులకు కూడా జ్ఞానోదయం కలిగించాడు. రాజు ఇక నుంచి అనవసర విషయాలజోలికి వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నడు.
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655