Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాచలం: ఆంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చాలా బాధపడుతున్నానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భద్రాచలం పర్యటనలో భాగంగా వీరభద్ర ఫంక్షన్ హాల్లో ఆదివాసీలతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్కు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పలు సమస్యలను విన్నవించారు. ఆంధ్రాలో విలీనమైన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపి ఇక్కడి ప్రజల బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. గోదావరి వరదలతో ఇక్కడి ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని.. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని.. విలీన గ్రామాల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై హామీ ఇచ్చారు. అంతకుముందు శ్రీ సీతారామచంద్రస్వామి వారిని గవర్నర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేకపూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.