Authorization
Tue May 06, 2025 12:35:52 am
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
ఎర్రగడ్డ గ్రామంలో రైతు చింతలపూడి రామారావు సాగుచేసిన వరంగల్ 1246 సన్న రకం వరి పొలాన్ని శుక్రవారం కె.వి.కె వరంగల్ ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిలో దోమపోటు, ఉల్లికోడు, పసుపు ముద్దలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని నివారించుకోవాలని రైతులకు సూచించారు. దోమపోటు నివారణకు డైనటోఫ్యూరాన్ 100 గ్రాములు లేదా పైమిట్రోజిన్ 120 గ్రాములు ఎకరానికి పిచికారి చేయాలని తెలిపారు. పసుపు ముద్దలు రాకుండా ఉండడానికి ప్రాపికొనజోల్ 200 ఎమ్ఎల్ ఎకరానికి పిచికారి చేసి నివారించుకోవచ్చు అన్నారు. ఈ రకం వరి పురుగులను, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు జె హేమంత్ కుమార్, చైతన్య, ఫణీశ్రీ, వరంగల్ ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు సతీష్ కుమార్, హరిప్రసాద్, కూసుమంచి వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.విజయ చంద్ర, మండల వ్యవసాయ అధికారులు నారెడ్డి సీతారాంరెడ్డి పాల్గొన్నారు.