Authorization
Tue May 06, 2025 08:45:19 pm
కలెక్టర్ వి పీ గౌతమ్
నవతెలంగాణ-రఘునాధపాలెం
పోడు వ్యవసాయదారుల సమస్య శాశ్వత పరిషారానికి రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశ్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని పోడు వ్యవసాయదారులందరూ గ్రామంలో ఐక్యతతో, కలిసికట్టుగా ఉండి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. మంగళవారం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి రెవెన్యూ గ్రామ పరిధిలోని రజబ్ అలీనగర్ లో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని, పోడు. వ్యవసాయదారులు దరఖాస్తు చేసుకునే విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న పోడు వ్యవసాయదారులకు గతంలో రెండు విడతలుగా హక్కుపత్రాలు అందించడం జరిగిందని, అయిననూ ఇంకనూ అర్హులుగా ఉన్నవారికి న్యాయంచేసేందుకు, ఇకముందు అటవీ ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, అర్హులందరూ తప్పనిసరిగా క్లయిమ్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. దీనికిగాను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న ఫారెస్ట్ రైట్ కమిటీలు, గ్రామ స్థాయి అధికారులు అర్హులందరికీ అవగాహనపరచి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న ప్రతి క్లయిమ్ ను పూర్తి స్థాయిలో పరిశీలన చేసి గ్రామ సభ తుది నిర్ణయం. ప్రకారం డివిజన్, జిల్లా స్థాయి కమిటీలకు పంపబడుతాయని, దరఖాస్తు చేసుకునేందుకు సంబంధిత దరఖాస్తు ఫారాలు గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి పొంది సమగ్ర సమాచారం పొందుపరిచి అవసరమైన జత ప్రతులతో తిరిగి పంచాయితీ కార్యదర్శికి సమర్పించాలని ప్రజలకు కలెక్టర్ అవగాహన కల్పించారు.
అనంతరం రజబ్ అలీ నగర్ మండల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, విద్యాబోదన, ఉపాధ్యాయుల వివరాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, విజయలక్ష్మీ, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి, కృష్ణనాయక్, తహశీల్దారు, జీ, నర్సింహారావు, ఎంపిడిఓ రామకృష్ణ, గ్రామ సర్పంచ్ బోడా శరత్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి ప్రకాష్, గ్రామ కార్యదర్శి యండి. ఫజల్ పాల్గొన్నారు.