Authorization
Wed May 07, 2025 01:49:40 am
- కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్రంలోని పరిశ్రమల్లో 72 షెడ్యుల్ పరిశ్రమల కనీస వేతనం జీఓలను వెంటనే సవరించాలని, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా స్థానిక కార్యాలయం నుండి భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ కన్వీనర్ డి.వీరన్న అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజె.రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు నుండి షెడ్యుల్ పరిశ్రమలలో పని చేస్తున్న కోటి ఇరవై లక్షల మంది కార్మికులు కనీస వేతనాలు సవరించలేదన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు జీఓలు సవరణ చేయకుండా గత 15 సంవత్సరాలుగా తాత్సారం చేస్తున్నారన్నారని విమర్శించారు. అనంతరం ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షులు జలీల్ మాట్లాడుతూ 5 రంగాలలో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ 5 రంగాలలో జీవోలు గెజిట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదన్నారు. ఈ సభలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి పిట్టల రాంచందర్, ఇఫ్య్టూ జిల్లా కార్యదర్శి యల్.విశ్వనాథం, ఇఫ్య్టూ జిల్లా కార్యదర్శి కండగట్ల సురేందర్‌లు ప్రసంగించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, ఏఐటీయూసీ నాయకులు జాకీర్ హుస్సేన్, ఇఫ్య్టూ నాయకులు ఉమర్, అమ్రాజ్ డేవిడ్, వేల్పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.