Authorization
Tue May 06, 2025 08:36:12 am
- ఐటీడీఏ పీవో
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ప్రాంతాల గ్రామాలలో ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ పథకం కింద, మౌలిక వసతుల కల్పనకు గ్రామాలను గుర్తించాలని, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రూ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 64 గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఒక్కొక్క గ్రామంలో సమస్యలను పరిష్కరించడానికి గ్రామానికి 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, దీనిలో మొదటిగా 20 గ్రామాలకు నిధులు మంజూరయ్యాయని, ప్రతి గ్రామంలో విద్యా, వైద్యం, పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, మంచినీరు, అంగన్వాడి సెంటర్లో నెలకొన్న సమస్యలు, కరెంటు సమస్యలు వారం రోజుల్లో తనకు పంపించాలని డీఆర్డీఓ మదనగోపాలను ఆదేశించారు. రెండో విడతలో 20 గ్రామాలను మండలాల వారీగా గుర్తించి, ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలను సంబంధిత గ్రామంలోని పెద్దల ద్వారా తెలుసుకొని, గ్రామాలలో పర్యటించి ఆ గ్రామంలో ముఖ్యమైన సమస్యలను గుర్తించి, గ్రామాల అభివృద్ధి కొరకు అవసరమైన ప్రతిపాదనలు ఒక వారం రోజుల్లో సమర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ మదన గోపాల్, ఎస్ఓ సురేష్ బాబు, డీఎంజీసీసీ వాణి, డీపీఓ పవన్, ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, వ్యవసాయ అధికారి రవికుమార్, ఇరిగేషన్ అధికారి అర్జున్, డీఈఓ సోమశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.