Authorization
Wed May 07, 2025 12:18:25 am
నవతెలంగాణ- ఖమ్మం
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 3వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన మోడీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీగుతున్నాడని, ప్రభుత్వ రంగ సంస్థలను అత్యంత తక్కువ ధరలకు కార్పొరేట్శక్తులకు అమ్మేస్తూ యువతలో ఉన్న చిన్న ఆశను కూడా చంపేస్తున్నాడని ఆయన అన్నారు. మోడీ ఈ 8 ఏళ్ల పాలనలో యువతకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశంలో జాతీయ ఉన్మాదాన్ని ప్రేరేపించి యువతను రెచ్చగొట్టి, మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రాంతీయ తగాదాలు పెడుతూ పబ్బం వెళ్లబుచ్చుతున్నాడని ఆయన అన్నారు. అందుకే ఢిల్లీలో భారీ యువజన ర్యాలీ నిర్వహించనున్నట్లు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయునట్లు తెలిపారు. యువజనుల సత్తా చూపేందుకు ఈ ర్యాలీకి, ధర్నాకు ఎక్కువ మంది యూత్ కదిలి రావాలని సందర్భంగా పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నరేష్, భూక్య ఉపేందర్ నాయక్, శీలం వీరబాబు, దిండు మంగపతి, జిల్లా సహాయ కార్యదర్శులు చింతల రమేష్, షేక్ రోషిని ఖాన్, కూరపాటి శ్రీను, కొంగర నవీన్, సుజాత, కనపర్తి గిరి, సురేష్ పాల్గొన్నారు.