Authorization
Wed May 07, 2025 01:02:27 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ ఏరియా హాస్పిటల్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి అధికారులను డిమాండ్ చేశారు. గురువారం ఐద్వా పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ ఏరియా హాస్పిటల్ సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ కంటి పరీక్ష డాక్టరు రెగ్యులరుగా రావాలని, ఈఎన్టీ డాక్టర్ పోస్ట్ ఖాళీగా ఉందని, హాస్పిటల్ ల్యాబ్‌లో 24 పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. మిగతా ముక్యమైన అనేక పరీక్షలు ప్రయివేట్ లాబ్‌లో వేల రూపాయలు ఖర్చుతో చేపించుకోవాల్సి వస్తున్నదని పాల్వంచ పట్టణం, మండలం, పాల్వంచ పక్కనే ఉన్న ములకలపల్లి, బూర్గంపాడు మండలాల ప్రజలు ఈ హాస్పిటల్‌కి వైద్యం కోసం పెద్దఎత్తున వస్తున్నారన్నారు.
ఈ హాస్పిటల్‌ను వంద పడకల హాస్పిటల్‌గా మార్చి అన్ని రకాల వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవుసరం ఉందని, నర్సింగ్ సిబ్బందిని, పారిశుద్ధ్య సిబ్బందిని పెంచాల్సి ఉందన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి వి.సత్యవాణి, అధ్యక్షురాలు కాతోజు సత్య, సభ్యులు గౌసియా, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.