Authorization
Wed April 30, 2025 11:09:53 pm
- వ్యకాస జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ - బోనకల్
పాలకులు పేదల పొట్ట కొట్టి పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల స్థాయి విస్తృత సమావేశం ఆ సంఘం మండల అధ్యక్షుడు ఉమ్మనేని రవి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు పొట్టకూటి కోసం గ్రామాలు వదిలి ఉపాధి కోసం ఇతర గ్రామాలకు వెళ్తున్నారన్నారు. అనేకమంది వ్యవసాయ కార్మికులు తమ తమ గ్రామాలలో పనులు లేక ఆటోలలో, ట్రాక్టర్లలో, టాటా ఏసీలలో కిలోమీటర్ల దూరం పనుల కోసం వెళ్తున్నారన్నారు. పనులు లేక సుదూర ప్రాంతాలకు వెళుతున్న వ్యవసాయ కార్మికులకు వెంటనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పండుతుందని విమర్శించారు. దీనివలన అనేక మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా కొలతల ప్రకారం కూలి కాకుండా రోజు వారి కూలీ 800 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలలో పాలకుల అనుసరిస్తున్న విధానాలపై, వ్యవసాయ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. అనేక తీర్మానాలు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ కార్మికుల కోసం భవిష్యత్తులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాల నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఆ సంఘం మండల ప్రధాన కార్యదర్శి బంధం శ్రీనివాసరావు, నాయకులు గుగులోతు శారద, కర్లకుంట దేవమణి, ఆళ్ల పుల్లమ్మ, దూబా భద్రాచలం, నోముల పుల్లయ్య, కొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.