Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువనేశ్వర్‌లో జాతీయస్థాయి సదస్సులో బహూకరణ
నవతెలంగాణ-కొత్తగూడెం
జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థ మరోసారి అత్యుత్తమ జియో మైన్ టెక్ 'గ్లోబల్ రెయిన్బో' అవార్డును అందుకుంది. డైరెక్టర్ ఫైనాన్స్, (పా) ఎన్.బలరామ్‌కు ఉత్తమ డైరెక్టర్, కార్పోరేట్ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ లీడర్ షిఫ్ ఎక్సలెన్స్ అవార్డును బహూకరించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఖనిజ కంపెనీలు, అధికారులను గుర్తించి, వారికి ప్రోత్సహించే, జియో మైన్ టెక్ సంస్థ గురువారం ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరిగిన 'నేషనల్ టెక్నాలజీ డే' ఉత్సవంలో ఈ అవార్డులను ప్రకటించి ఒడిశా రాష్ట్ర పర్యావరణ, అటవీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ అమత్ ఈ అవార్డులను సింగరేణి సంస్థ తరఫున హాజరైన జనరల్ మేనేజర్, (హెచ్.ఆర్.డి) బి.హెచ్.వెంకటేశ్వర్లు, ఏజీఎం (నైనీ) మజుందార్, ఎస్.ఈ. రాజశేఖర్‌కు అందజేశారు.
సింగరేణికి 'విబ్జియార్ గోల్డెన్ రెయిన్బో' అవార్డు
2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన అత్యుత్తమ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా, సిఎస్ఆర్. కార్యక్రమాలు, పర్యావరణ చర్యలకు గుర్తింపుగా జియో మైన్ టెక్ వారు 'విబ్జియార్ గోల్డెన్రెయిన్బో అవార్డు'ను సింగరేణి సంస్థకు అందచేశారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ 667 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 671లక్షల బొగ్గు ఉత్పత్తి సాధించింది.రూ.32,830 కోట్ల టర్నోవర్ సాధించింది. సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ సంస్థగా పేరు తెచ్చుకుంది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఇప్పటికే సుమారు 6 లక్షల మొక్కలను నాటింది. ఒక మైనింగ్ సంస్థగా అన్ని విభాగాల్లోనూ, అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న సింగరేణికి 'విబ్జియార్ గోల్డెన్ రెయిన్బో' అవార్డును అందజేశారు.
పర్యావరణహితునికి 'బెస్ట్ డైరెక్టర్ లీడర్షిప్ ఎక్సలెన్స్' అవార్డు
సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్, (పా) ఎన్.బలరామ్ పర్యావరణ, అటవీ విభాగాల్లో చేస్తున్న సేవలకు, ''గ్రీవెన్స్ డే'' వంటి వినూత్న ప్రక్రియ ద్వారా కార్మికుల సమస్యలను తెలుసుకోవడం, పరిష్కరించడం వంటి చర్యలకు గుర్తింపుగా 'బెస్ట్ డైరెక్టర్, కార్పోరేట్ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ లీడర్షిప్ ఎక్సలెన్స్' అవార్డును బహుకరించారు. ఎన్.బలరాం సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సంస్థ ఆర్థిక వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రశంసలు అందుకున్నారు. కోవిడ్-19 కరోనా సమయంలో ఆయన కంపెనీ ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దటంలోనూ, టర్కీ నుండి 5 ఆక్సిజన్ ప్లాంట్లను రప్పించి, సింగరేణి వ్యాప్తంగా కార్మికుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేయడం, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సింగరేణి ఏరియాల్లో ''గ్రీవెన్స్ డే''ని నిర్వహించారు. స్వయంగా కార్మికుల నుంచి సమస్యలు స్వీకరించి, పరిష్కరించే ప్రయత్నం చేశారు. బ్యాంకు ఖాతాలు ఉన్న సింగరేణి ఉద్యోగులందరికీ వారి ఖాతాలను 'కార్పోరేట్ శాలరీ అకౌంట్లు'గా మార్పించి ప్రమాద బీమా సౌకర్యాన్ని బ్యాంకుల ద్వారా వర్తింప చేయడానికి ప్రత్యేక చొరవ చూపారు. సింగరేణి వంటి పెద్ద సంస్థలో ప్రస్తుతం ఆయన రెండు ప్రధాన డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వినూత్న ఆలోచనలు అమలు చేస్తూ, పర్యావరణహిత చర్యలు చేపడుతున్న ఎన్.బలరామ్‌కు ఈ అవార్డు రావడం పట్ల సర్వత్రా కార్మికులు, ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.