Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఎల్ రాహుల్ స్థానంలో ఎంపిక
- జైదేవ్ ఉనద్కత్, ఉమేశ్‌లకు గాయాలు
- ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు
నవతెలంగాణ-ముంబయి
ఐసీసీ మెగా టైటిల్ వేటలో టీమ్ ఇండియా దశాబ్ద కాల నిరీక్షణకు తెరదించే అవకాశాలకు గాయాలు గండికొట్టేలా కనిపిస్తున్నాయి!. కారు ప్రమాదంతో విధ్వంసకారుడు రిషబ్ పంత్, వెన్నునొప్పి శస్త్రచికిత్సతో పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా, వెన్నుగాయంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అప్పటికే ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరం కాగా.. తాజాగా ఆ జాబితాలో మరో ఆటగాడు చేరిపోయాడు. వికెట్ కీపర్, బ్యాటర్ కెఎల్ రాహుల్ గాయం బారిన పడ్డాడు. ఐపీఎల్16లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడుతున్న కెఎల్ రాహుల్ తొడ గాయం బారిన పడ్డాడు. కొన్ని మ్యాచులకు బెంచ్‌కు పరిమితమైన కెఎల్ రాహుల్ వైద్య బృందం సలహాతో ఐపీఎల్16కు దూరమయ్యాడు. పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్ సైతం గాయాల బారిన పడిన ఆటగాళ్ల జాబితాలో చేరారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ తొడ కండరాల గాయానికి లోనయ్యాడు. జైదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్ గాయాలను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అవసరమైతే ఈ ఇద్దరికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఇక కెఎల్ రాహుల్ త్వరలోనే శస్త్రచికత్సకు వెళ్లనున్నాడు. సర్జరీ అనంతరం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్ కోసం రిపోర్టు చేయనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
కెఎల్ రాహుల్ నిష్క్రమణతో ఆ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికయ్యాడు. 48 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన కిషన్ 38.76 సగటుతో 2985 పరుగులు చేశాడు. తాజా రంజీ సీజన్లో రెండు మ్యాచులు ఆడిన ఇషాన్ కిషన్ 45 సగటుతో 180 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్‌లను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. స్టాండ్ బై ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రమే టెస్టు క్రికెట్ అనుభవం ఉంది. జూన్ 7-11న లండన్‌లోని ది ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియాలు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ గద కోసం పోటీపడనున్నాయి. తొలి టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడగా.. కివీస్ గదను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో పోటీపడటం భారత్‌కు ఇది వరుసగా రెండోసారి కావటం విశేషం.
భారత టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, కె.ఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జైదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్.