Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ తొలి రోజే సుదీర్ఘ ప్రసంగం చేశారు.
బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం డౌనింగ్ స్ట్రీట్- 10 కు విచ్చేసిన రిషి ప్రధాని హోదాలో ఐదు నిమిషాల 56 సెకన్ల పాటు మాట్లాడారు.
మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేసిన తప్పిదాలను సరిదిద్దడం తనముందున్న బాధ్యత అని తెలిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ ను ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ప్రజలు కొన్ని కఠిన నిర్ణయాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఆర్థిక సుస్థిరత, ఆర్థిక భరోసా అంశాలు తమ ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనవని తెలిపారు.
ఇక, బోరిస్ జాన్సన్ గురించి చెప్పాల్సి వస్తే, ప్రధానమంత్రిగా అనేక ఘనతరమైన కార్యక్రమాలు ఆయన చేపట్టారన్నారు. ఆయన ఆప్యాయత, ఔదార్యాలను ఎంతో విలువైనవిగా భావిస్తానని చెప్పారు. అయితే 2019లో కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారంటే అది ఏ ఒక్క వ్యక్తి ఘనతగానో, ఏ ఒక్క వ్యక్తి సొంతం అనో భావించరాదని.. అది అందరికీ సంబంధించిన, అందరినీ ఏకం చేసే విజయం అన్నారు. ఆ విజయానికి మన మానిఫెస్టోనే గుండెకాయ అని.. ఆ మానిఫెస్టోను అమలు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. తమ పార్టీలో తనను నమ్మారని... ఇక తాను ప్రజలు నమ్మకం పొందాల్సి ఉందన్నారు.
అత్యంత పటిష్టమైన జాతీయ ఆరోగ్య వ్యవస్థ (ఎన్ హెచ్ఎస్) ను రూపొందిస్తామని తెలిపారు. మెరుగైన విద్యా వ్యవస్థ, శాంతిభద్రతలు, సరిహద్దుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, సాయుధ దళాలకు మద్దతు, సంక్షేమం, బ్రెగ్జిట్ నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకుని బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగంలో ఉపాధి కల్పన కోసం పాటుపడతానని చెప్పారు.