Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం లోపల శ్లాబ్ పెచ్చులూడి పడటంతో కానిస్టేబుల్‌కు తీవ్రంగా, సీఐ కుమార్తెకు స్వల్పగాయాలయ్యాయి. పాఠశాలకు పండగ సెలవు కావడంతో సోమవారం సీఐ ఎల్.రమేష్ తన నాలుగేళ్ల కుమార్తె మోక్షితను తీసుకుని ఉదయం కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం మధ్య గదిలో కానిస్టేబుళ్లతో పాటు సీఐ కుమార్తె కూర్చున్నారు. అదే సమయంలో కానిస్టేబుల్ జమలయ్య కూర్చున్న ప్రాంతంలో స్లాబ్‌నుంచి సీలింగ్‌ను చీల్చుతూ పెద్దపెద్ద పెచ్చులూడి పడటంతో ఆయన తలపై రక్తగాయాలయ్యాయి. కొన్ని పెచ్చులు సీఐ కుమార్తె కూర్చున్న కుర్చీపై పడటంతో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. లోగడ స్థానిక బస్టాండు పక్కన పోలీసుస్టేషన్ ఉండేది. మూడున్నరేళ్ల కిందట కొత్త భవనాన్ని నిర్మించి పోలీసుస్టేషన్‌ను తరలించారు. బస్టాండ్ పక్కనున్న స్టేషన్ భవనానికి తాత్కాలిక మరమ్మతు చేయించి సీఐ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. గతంలోనే శ్లాబ్ పాడవడంతో తాత్కాలిక మరమ్మతు చేయించారు. భవనం దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి ఖాళీ చేస్తామని సీఐ రమేష్ తెలిపారు.