Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. 'లైగర్' చిత్ర ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ చిత్ర డిస్టిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబులు తనను వేధిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. శ్రీను, శోభన్‌లు డబ్బుల విషయంలో తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల క్రితం పూరీ వాయిస్‌తో విడుదలైన ఆడియో ఫైల్ వైరల్‌గా మారింది. అందులోనూ.. 'లైగర్' వల్ల నష్టపోయిన బాధితులంతా ఈ నెల 27న తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని పూరీ వాపోయారు. డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా పలువురు డిస్ట్రిబ్యూటర్లు బెదిరింపులకు పాల్పడ్డారని పూరీ ఆరోపించారు. డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో ముందస్తుగా భద్రత కల్పించాలని పూరీ జగన్నాథ్ పోలీసులను కోరారు.
విజయ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం పాన్ ఇండియా చిత్రమే 'లైగర్'. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఆగస్టు 25న విడుదలై, బాక్సాఫీసు వద్ద పరాజయాన్ని చవిచూసింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.