Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూపీ: ఢిల్లీ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన తినుబండారాల అంగళ్ల వద్ద కారు పార్కింగు కోసం జరిగిన గొడవ దారుణహత్యకు దారి తీసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో వరుణ్ (35) అనే యువకుణ్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ఇటుకలతో కొట్టి చంపినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. దిల్లీ పోలీసు విభాగంలో ఏఎస్‌ఐగా పనిచేసి పదవీ విరమణ పొందిన కన్వర్ పాల్ కుమారుడిగా వరుణ్‌ను గుర్తించినట్లు తెలిపారు. భార్య అంజలిని మోహన్‌నగర్ బస్‌స్టాండులో దించి.. ఇద్దరు మిత్రులతో కలిసి వచ్చిన వరుణ్ అల్పాహారం కోసం రోడ్డు పక్కన తన కారు ఆపారు.
దీని కారణంగా పక్కనే ఆపి ఉన్న మరో కారు డోరు తెరుచుకోకపోవడంతో గొడవ మొదలై ఇటుకలతో దాడి దాకా వెళ్లింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తీవ్రంగా గాయపడిన వరుణ్‌ను దిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుల అరెస్టుకు అయిదు బృందాలు గాలిస్తున్నట్లు ఏఎస్పీ జ్ఞానేంద్రసింగ్ తెలిపారు. దాడి సమయంలో వరుణ్ వెంట ఉన్న దీపక్, సంజయ్.. మిత్రుణ్ని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా, కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి అదృశ్యం కావడంతో ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లను కూడా చేర్చారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు.