Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గుజరాత్ శాసన సభ ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలోని సుమారు 900 మంది అధికారులను బదిలీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు వివిధ గ్రేడ్లు, సర్వీసులలో పని చేస్తున్న అధికారులను బదిలీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీకి సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. ఈసీ ఈ నెల 21న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి లేఖలు రాసింది. అధికారుల బదిలీ గడువు ముగిసిన తర్వాత వారి బదిలీలకు సంబంధించిన ఆదేశాలను పాటించినట్లుగా తెలిపే నివేదికలను సమర్పించాలని కోరింది. మిగిలిన 51 మంది అధికారులను తమ తమ ప్రధాన కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని కోరాలని తెలిపింది. వీరిలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. గురువారంనాటికి ఈ నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. 182 స్థానాలున్న గుజరాత్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఈసీ ప్రకటించవలసి ఉంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు నవంబరు 12న జరుగుతాయి, ఫలితాలను డిసెంబరు 8న ప్రకటిస్తారు.