Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), హర్షవర్దన్ రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)లను కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో పోలీసులు బుధవారం ముగ్గురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ లపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
రోహిత్ రెడ్డి ఫిర్యాదులో చెప్పిన విషయాలను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ. 100 కోట్ల ఆఫర్ చేస్తూ తమను సంప్రదించారని రోహిత్ రెడ్డి చెప్పారు. నందకుమార్ మధ్యవర్తిత్వంలో రామచంద్ర భారతి, సింహయాజులు ఫాం హౌస్ కు వచ్చారని తెలిపారు. పార్టీ మారితే డబ్బుతో పాటు సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామని, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించినట్టు ఆరోపించారు. తనతో పాటు ఎవరైనా పార్టీ మారితే వారికి కూడా రూ. 50 కోట్లు ఇస్తామని చెప్పినట్టు రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రభారతి, నందకుమార్ లు బీజేపీ చెందిన వ్యక్తులుగా ఆయన తెలిపారు.