Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇటీవల పాకిస్థాన్ డ్రోన్లు దేశంలోకి చొరబడుతున్న ఘటనలు ఎక్కువవుతున్న సంగతి తెలిసింతే. ఈ నేపథ్యంలో భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఆక్వా జామర్లు, మల్టీ షాట్ గన్స్ ఏర్పాటు చేసింది.
పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు ఇటీవల తరచుగా సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్వా జామర్లుగా పిలిచే క్వాడ్‌కాప్టర్ జామర్‌లను భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ ఏర్పాటు చేసింది. అలాగే డ్రోన్లను కూల్చేందుకు మల్టీ షాట్ గన్ వ్యవస్థలను నెలకొల్పింది.
కాగా, ఆక్వా జామర్లు 4,900 మీటర్ల ఎత్తు వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని, శత్రు డ్రోన్లను గుర్తించడంతోపాటు దాని ఆపరేటర్‌తో కనెక్టివిటీని తెంచి వేస్తాయని రక్షణ అధికారులు తెలిపారు. ఆక్వా జామర్లు డ్రోన్ సిగ్నల్‌ను 5 కిలోమీటర్ల పరిధి వరకు గుర్తిస్తాయని చెప్పారు. ఆ తర్వాత మల్టీ వెపన్ ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన మల్టీ షాట్ గన్స్‌తో శత్రు డ్రోన్లను కూల్చివేస్తామని తెలిపారు. మూడు గన్స్‌తో కూడిన ఈ వ్యవస్థ త్రికోణంలో ఒకేసారి తొమ్మిది రౌండ్లు కాల్పులు జరుపుతుందని చెప్పారు. భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి 400 మీటర్ల దూరంలో ఈ రెండు వ్యవస్థలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే నియంత్రణ రేఖకు 2.5 కిలోమీటర్ల దూరంలోని నిరంతర నిఘా కేంద్రాలతో ఈ వ్యవస్థలను అనుసంధానం చేసినట్లు చెప్పారు.