Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక 'కీ'ని ఈ నెల 28న విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించినట్టు తెలిసింది. కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 16న నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,86,031 మంది పరీక్ష రాశారు. 150 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 150 ప్రశ్నలు ఇచ్చారు. ప్రిలిమినరీలో అర్హత సాధించే అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక పోస్టుకు 50 మంది చొప్పున (1:50 నిష్పత్తి ప్రకారం) మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీనిలో కటాఫ్ మార్కుల పద్ధతి లేదు. మెరిట్ జాబితా ప్రకారం మెయిన్‌కు ఎంపిక చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసిన తర్వాత దానిపై 5 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది. వాటిపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి, తుది 'కీ'ని ప్రకటించనున్నారు. దాంతో పాటు ఫలితాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.