Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నవీపేట్
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే బోధన్ లో తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో గురువారం మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. తుంగిని గ్రామంలో సైతం సమస్యలను తెలుసుకొని పలు అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూన.. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసి కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో సైతం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యేలను ఈడి కేసులు అంటూ బెదిరిస్తూ.. అలాగే కాంట్రాక్టుల పేరుతో తమ వైపు లాక్కునేందుకు నాటకాలు చేస్తుందని.. ఆ ఆటలు తెలంగాణలో సాగవని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మళ్లీ అధికారంలో వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ చైర్మన్, మగ్గరి హన్మాన్లు, ఆర్ఎస్ నాయకులు నర్సింగ్ రావు, రవీందర్ రావు, అబ్బన్న, బాబర్, తెడ్డు పోశెట్టి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.