Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనేయడం, వినకపోతే ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్న ఘటనలు పెరిగిపోయాయని అన్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో వందల కోట్ల రూపాయల డీల్ మాట్లాడటం.. ఇందుకోసం ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్వామీజీలను ప్రయోగించడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొన్నారు. చాలా రోజులుగా పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఘటనతో బీజీపీ బండారం బయటపడిందని తమ్మినేని అన్నారు. పైగా దొంగే దొంగ అని అరిచినట్టుగా కాషాయ పార్టీ నేతల తీరు ఉందని విమర్శించారు. ఇదేదో కేసీఆర్ కుట్ర చేసినట్టుగా, ఢిల్లీకి చెందిన ఆ స్వామీజీలతో ముందుగానే మాట్లాడినట్టు బీజేపీ నేతలు చెప్పడం సిగ్గులేనితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ నేతల మాటలను తెలంగాణ సమాజం నమ్మే స్థితిలో లేదని అన్నారు. ఏ ఆగడాలు చేసైనా సరే మునుగోడులో గెలవాలని బీజేపీ తాపత్రయ పడుతోందని అన్నారు. బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా.. మునుగోడులో బీజేపీ గెలవదని, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.