Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇల్లాలు చేసిన పొరపాటు పనికి ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతిచెందిన ఘటన నాగ్లా కన్హై గ్రామంలో గురువారం జరిగినట్టు ఎస్పీ కమలేశ్ దీక్షిత్ వెల్లడించారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శివానందన్ (35), అతడి కుమారులు శివంగ్ (6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్రసింగ్ (55) పొరుగింటి వ్యక్తి సోబ్రాన్ (45) ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే రవీంద్రసింగ్, శివాంగ్, దివ్యాన్ష్ ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సోబ్రాన్, శివానందన్‌ల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వారిని సైఫాయి ఆస్పత్రికి తరలించగా అక్కడ వారిద్దరూ ప్రాణాలు విడిచారు. అయితే, శివానందన్ భార్య వరి పంటలో పిచికారీ చేసే మందును పొరపాటున టీ పొడి అనుకొని కలిపేయడంతో అది విషపూరితమై ఈ పెను విషాదానికి కారణమైనట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఎస్పీ తెలిపారు.