Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలోన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్‌తో స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బాధ్యతలను ఆయన గురువారం చేపట్టారు. అయితే వచ్చీ రాగానే కంపెనీని తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించినవారిని తొలగించారు. ఈ మేరకు యూఎస్ మీడియా పేర్కొంది. సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ విభాగం అధిపతి విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, జనరల్ కౌన్సెల్ సియాన్ ఎడ్జెట్‌లను ఆయన తొలగించినట్టు తెలిసింది. ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఈ నెల 28 లోపు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ కోర్టు తుది గడువు విధించిన నేపథ్యంలో ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎలన్ మస్క్ మాట్లడుతూ.. తాను ట్విటర్‌ను కొనడం వెనుక లక్ష్యం మరింత డబ్బు సంపాదించుకోవడం కాదని చెప్పారు. మానవాళి అంటే తనకు చాలా ఇష్టమని, దానికి సాయపడేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ట్విటర్‌లో స్పామ్ బాట్స్‌ను చీల్చి చెండాడుతానని చెప్పారు. యూజర్లకు కంటెంట్‌ను ఎలా చేరవేయాలో నిర్ణయించే ఆల్గోరిథమ్స్‌ను బహిరంగంగా అందుబాటులో ఉంచుతానన్నారు. విద్వేషం, విభజనవాదాలకు వేదికగా ట్విటర్ పని చేయకుండా చూస్తానన్నారు. అదే సమయంలో సెన్సార్‌షిప్‌ను పరిమితం చేస్తానని తెలిపారు.