Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : తీసుకున్న అప్పు చెల్లించకపోతే వారి కుటుంబంలోని బాలికలను విక్రయించాలని.. లేదంటే వారి తల్లులపై లైంగికదాడి చేయాలనే దారుణమైన తీర్పులను రాజస్థాన్ లోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ పెద్దలు జారీ చేస్తున్నారనే విషయం వెలుగు చూసింది. ఈ మేరకు హిందీ జాతీయ పత్రిక దైనిక్ భాస్కర్ ఓ కథనాన్ని బయటపెట్టింది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
దైనిక్ భాస్కర్ కథనం ప్రకరారం.. రాజస్థాన్ లోని భిల్వారా తదితర ప్రాంతాల్లోని కొన్ని కులాల ప్రజలు వివాదాల పరిష్కారానికి కుల మండళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే వారు దారుణమైన తీర్పులను ఇస్తున్నట్టు తెలిసింది. ఒక కేసులో రూ.15 లక్షల రుణం చెల్లించనందుకు సోదరిని విక్రయించాలంటూ కుల పెద్దలు ఆదేశించారు. ఆ తర్వాత అతడి 12 ఏండ్ల బాలికను కూడా విక్రయించాలని లేదంటే వారి తల్లులపై లైంగికదాడి చేయాలనే తీర్పులను కూడా వారు జారీ చేస్తున్నట్టు కథనంలో పేర్కొన్నారు. ఓ బాలికను రూ.6 లక్షలకు విక్రయించగా, కొనుగోలుదారులు ఆమెను ఆగ్రా తీసుకెళ్లారు. ఆ తర్వాత మూడు విడతలుగా ఆమెను విక్రయించారని తెలిసింది. అలా నాలుగు సార్లు ఆమె గర్భం దాల్చింది. మరో ఘటనలో తన భార్య చికిత్స కోసం భర్త రూ.6 లక్షలు తీసుకుని చెల్లించనందుకు కూతుర్ని అమ్మేలా కులపెద్దలు తీర్పు నిచ్చిన దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొనుగోలు చేసిన బాలికలను విదేశాలకూ రవాణా చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై నాలుగు వారాల్లోగా చర్యల నివేదికను తమకు సమర్పించాలని రాజస్థాన్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.