Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ర్టంలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ లో జరిగిన బేరసారాల ఆడియో లీకైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామీజీ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర, నందకుమార్ మధ్య జరిగిన సంభాషణలు అంటూ చెబుతున్న ఆ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ ఆడియోలో ఏముందంటే..
బీజేపీలోకి రావడానికి నేను క్లియర్ చేస్తానని... బీజేపీలో మొదటి , రెండు స్థానాల్లో ఉన్న వ్యక్తులతో నేను మాట్లాడిస్తానని స్మామిజీ చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ఈడీ , సీబీఐ దాడులు జరగకుండా చూసుకుంటానని అన్నట్టు ఉంది. మునుగోడు ఉపఎన్నికలు జరుగుతున్న క్రమంలో మనం ఇక్కడ కలుసుకోవడం సరికాదని, హైదరాబాద్ మంచి ప్లేస్ అని రోహిత్ రెడ్డి చెప్పగా.. నవంబర్ 25 తర్వాత తాను హైదరాబాద్‌కు వస్తానని, ఆ రోజు కూర్చోని ఫైనల్ సెటిల్‌మెంట్ చేసుకుందామంటూ రామచంద్ర భారతి స్వామిజీ చెప్పినట్లు ఆడియో కాల్‌లో ఉంది. ఇంకా ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వస్తారంటూ స్వామిజీ చెప్పినట్లు ఉంది.
ముగ్గురు ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్దంగా ఉన్నారని, కానీ ఆ ఎమ్మెల్యేల పేర్లను తాను బయటపెట్టనంటూ రోహిత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నందూ మీద తాము ఒత్తిడి పెట్టామని, అందుకే అతను రోజూ మీకు కాల్ చేస్తున్నారంటూ స్వామిజీ చెప్పినట్లు ఆడియోలో ఉంది. ఈ విషయం కేసీఆర్‌కు తెలిస్తే మా పని అయిపోతుందంటూ రోహిత్ రెడ్డి చెప్పగా.. మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాము చూసుకుంటామని, కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉందంటూ స్వామీజీ అన్నట్టు ఆడియోలో ఉంది.