Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112కి కాల్స్ చేసి దుర్భాషలాడుతున్న ఓ యువతికి మూడు నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటన హార్యానాలో వెలుగు చూసింది. పంచకులలోని బీర్ ఘగ్గర్ నివాసి సుమన్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112కి కాల్స్ చేసి అశ్లీలమైన మాటలు మాట్లాడడమే కాకుండా.. పాటలు కూడా వినిపిస్తూ ఉండేది.
టెలికాం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజేష్ కాలియా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఒక కాలర్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112కి ప్రాంక్ కాల్స్ చేస్తూ తిడుతోంది. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తోంది. అనవసరంగా ఇటువంటి కాల్స్ చేస్తూ ఉండడం వలన.. ఆపదలో ఉన్న ప్రజలకు అత్యవసర సేవలు అందుబాటులో లేకుండా పోతాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు విలువైన సమయాన్ని వృధా చేస్తుంటారని పంచకుల డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు పంపిన ఫిర్యాదులో ఎస్పీ పేర్కొన్నారు. విచారణలో నిందితురాలి ఫోన్ నంబర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సెక్టార్-5 పోలీస్ స్టేషన్‌లో ఆమెపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 186 (పబ్లిక్ సర్వెంట్‌ని పబ్లిక్ ఫంక్షన్‌లను అడ్డుకోవడం), 290 (పబ్లిక్ న్యూసెన్స్) మరియు 294 (అశ్లీల చట్టం మరియు పాటలు) కింద కేసు నమోదైంది. ప్రభుత్వ ఉద్యోగులు విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించారు.