Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులు హైదరాబాద్ నగరం విడిచి ఎక్కడికీ వెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది. బీజేపీలో చేరేలా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడటంతో.. బీజేపీ ఏజెంట్లు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గురువారం రాత్రి ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ రిమాండ్‌కు నిరాకరించింది. దాంతో సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నిందితులు ముగ్గురు 24 గంటలపాటు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. నిందితులు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ కమిషనర్‌కు అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో కీలక వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డితో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏవిధమైన సంప్రదింపులు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను శనివారం ఉదయం తొలి కేసుగా చేపట్టనున్నట్లు ప్రకటించింది.