Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుంది. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని బీజేపీ నేత ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగం నోట్‌ను కూడా జిల్లా ఎన్నికల అధికారి పంపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా మంత్రి జగదీశ్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. దీనిపై రేపు సాయంత్రం 3 గంటల్లోపు జగదీశ్‌రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. వివరణ ఇవ్వకపోతే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.