Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సినీ తారలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడులోని అధికార పార్టీ నేత సైదై సాదిక్ నటి ఖుష్బూకు క్షమాపణలు తెలిపారు. తన ప్రసంగాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో విడుదల చేశారని ట్విట్టర్‌లో ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఖుష్బూ మనసు గాయపడి ఉంటే తనను క్షమించాలని కోరారు. సినీ తారలు ఖుష్బూ, గౌతమి, నమిత, గాయత్రి తదితరలను ఉద్దేశించి తమిళనాడులోని అధికార పార్టీ నేత సైదై సాదిక్ చేసిన ‘ఐటెమ్స్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమంలో సాదిక్ మాట్లాడుతూ.. బీజేపీలో చేరిన ఆ నలుగురు ‘ఐటెమ్స్’ అని సాదిక్ అన్నారు. తమిళనాడులో కమలం వికసిస్తుందన్న ఖుష్బూ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అమిత్ షా బట్టతలపై జుట్టు మొలుస్తుందేమో కానీ, తమిళనాడులో కమలం మాత్రం వికసించదని అన్నారు.
సాదిక్ చేసిన ‘ఐటెమ్స్’ వ్యాఖ్యలపై ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. ‘‘వీరేనా కలైంజర్ వారసులు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కణిమొళిని ట్యాగ్ చేశారు. స్పందించిన కణిమొళి తమ పార్టీ నాయకుడి వ్యాఖ్యలపై తాను క్షమాపణలు చెబుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా క్షమార్హం కావని అన్నారు. ఆ తర్వాత సాదిక్ కూడా స్పందిస్తూ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తాజాగా, ఖుష్బూకి క్షమాపణలు తెలిపారు.