Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జనగామ జిల్లాలోని దేవరుప్పుల లోని కస్తూర్బా పాఠశాలలో గురువారం రాత్రి భోజనంలో బల్లి పడిన ఆహారం తిని 14 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, ఆర్డీవో, సంబంధిత అధికారులతో కలిసి వారు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, పరిసరాలు, వంట గది, భోజన హాల్‌ను మంత్రి పరిశీలించారు. అన్నంలో బల్లి రావడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్నున్నారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉన్నారని, ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే పర్యవసానాలు ఏంటో తెలుసా? అని నిలదీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భోజనం వడ్డించే ఏజన్సీలకు తగు సూచనలు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలు క్రమం తప్పకుండా పాటించాలని చెప్పారు. మిగతా అన్ని స్కూల్స్, హాస్టల్స్ లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం విద్యార్థినీలు, ఉపాధ్యాయులు, సిబ్బంది తో వేర్వేరుగా సమావేశమై అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బంది ఆలస్యంగా వస్తున్నారని, సాయంత్రం 5 గంటలకల్లా వండి వెళ్ళి పోతున్నారని, తామే వడ్డించుకుంటున్నామని మంత్రికి విద్యార్థినీలు ఫిర్యాదు చేశారు.