Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: పురుష ఆటగాళ్లతో సమానంగా మహిళా క్రికెట్ జట్టు సభ్యులకు వేతనాలు చెల్లించాలంటూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ ప్లేయర్, మహిళా క్రికెట్ లెజెండ్ ఝులన్ గోస్వామి ఆనందం వ్యక్తం చేసింది. సమాన వేతనాలను 'దీపావళి బహుమతి'గా వర్ణించింది. 'ఇది దీపావళి కానుక. ఎందుకంటే దీన్ని అస్సలు ఊహించలేదు. మహిళా క్రికెటర్లందరికీ ఇది గర్వించదగ్గ విషయం. ఈ అంశంపై కొన్నేళ్లుగా చర్చించుకుంటున్నాం' అని పేర్కొంది.
ఏళ్ల పాటు భారత మహిళా క్రికెట్‌కు విశేష సేవలందించి ఈ మధ్యే రిటైర్ అయిన గోస్వామిని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) శనివారం సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది. రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి మద్దతుగా నిలిచిన క్యాబ్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. సౌరభ్ గంగూలీ తరహాలోనే అడ్మినిస్ట్రేషన్ వైపు వెళతారా? అని ప్రశ్నించగా.. దాని గురించి ఇంకా ఆలోచించలేదని సమాధానం చెప్పింది. కొద్దికాలంపాటు జట్టుకు మెంటార్‌గానే ఉంటానని తెలిపింది. పురుషులతో సమాన వేతనాలకు సంబంధించిన విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జైషా గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ''వివక్షను అధిగమించే విధంగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. భారత క్రికెట్‌లో సమానత్వం అనే కొత్త శకానికి మేం నాంది పలకనున్నాం. పురుష ఆటగాళ్లు అందుకునే వేతనాన్నే ఇకపై బీసీసీఐ మహిళా క్రికెటర్లు సైతం పొందనున్నారు. (టెస్టు మ్యాచ్‌కు రూ.15లక్షలు, వన్డేకు రూ. 6లక్షలు, టీ20కి రూ. 3లక్షలు) టీమ్‌ఇండియా మహిళల విషయంలో ఇది నా నిబద్ధత. మాకు మద్దతుగా నిలిచినందుకు అపెక్స్ కౌన్సిల్‌కు ధన్యవాదాలు. జైహింద్'' అని జైషా పేర్కొన్నారు.