Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: స్పైస్‌జెట్ విమానం భారీ కుదుపులకు లోనైన ఘటనలో గాయపడిన వ్యక్తి మృతిచెందారు. ఈ ఏడాది మే నెలలో ఈ ఘటన జరగ్గా.. నెల రోజుల క్రితం మరణించినట్లు సదరు విమానయాన సంస్థ తెలిపింది. ఈ ఏడాది మే 1న స్పైస్‌జెట్‌కు చెందిన ముంబయి-దుర్గాపూర్ విమానం భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు, ముగ్గురు క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరైన పశ్చిమబెంగాల్‌కు చెందిన అక్బర్ అన్సారీ (48) సెప్టెంబర్ 26న మరణించారు.
వెన్నుముకలో తీవ్ర గాయం కారణంగా తీవ్ర అనారోగ్యం పాలై మరణించినట్లు వైద్యులు తెలిపారు. దాదాపు నెల రోజుల పాటు అన్సారీని వెంటిలేటర్‌పై ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్సారీకి సంబంధించిన హాస్పిటల్, ముందుల ఖర్చులకు సంబంధించిన అన్ని విధాలా సాయపడ్డామని స్పైస్‌జెట్ తెలిపింది. నిబంధనలను అనుసరించి పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు ఐసీయూలో చికిత్స తీసుకున్నట్లు డీజీసీఏ గతంలో ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో విమానం కుదుపులకు లోనై మరణం సంభవించిన ఘటనల్లో ఇది రెండోది. 1980ల్లో ఇలానే ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.