Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లోన్ యాప్ వేధింపులకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయినా లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు ఆపలేదు. మృతుడి భార్యకు ఫోన్లు చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. దాంతో
లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ కు చెందిన పండిటి సునీల్ సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పని చేసేవాడు. కరోనా లాక్ డౌన్ కాలంలో ఉద్యోగం కోల్పోవడం, అదే సమయంలో భార్య పండిటి రమ్యశ్రీ గర్భంతో ఉండడంతో అతను ఓ లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. అయితే అప్పు తీసుకున్న వారం రోజుల నుంచే సునీల్ కు ఫోన్ లు, మెసేజ్ లు రావడం మొదలైందని తెలిసింది. ఓ రోజు తనతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఫోన్లకు కూడా మెసేజ్ లు వచ్చాయని భార్య పండిటి రమ్యశ్రీ చెబుతోంది. సునీల్ తమకు అప్పు చెల్లించాల్సి ఉందని.. ఆ మొత్తం చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ మెసేజ్ లో ఉందన్నారు. ఇదిలా ఉండగా రమ్యశ్రీ ఓ బాబు కు జన్మనిచ్చింది. అయితే ఓవైపు సరైన ఉద్యోగం లేక, మరోవైపు లోన్ యాప్ వేధింపులతో 2020 డిసెంబర్ లో తన భర్త సునీల్ ఉరేసుకున్నాడని రమ్మశ్రీ చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.
అయితే భర్త మరణంతో పుట్టింటికి చేరిన రమ్యశ్రీకి లోన్ యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. తన భర్త తీసుకున్న అప్పును మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని ఫోన్లలో బెదిరిస్తున్నారని రమ్యశ్రీ వివరించారు. ఏడాదిగా ఈ వేధింపులు ఆగడంలేదని ఆమె చెప్పారు.