Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా పాతరేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్వి తమ్మినేని వీరభద్రం అన్నారు. తన స్వార్థం కోసం ఉప ఎన్నికను తీసుకొచ్చిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడారు. ఏడాది తర్వాత జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు. ఈ నాలుగేండ్ల కాలంలో ప్రభుత్వం అభివృద్ధికి సహకరించలేదు కాబట్టి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నాడన్నారు. కానీ వాస్తవం ఏంటంటే బీజేపీ అధిష్టానం ఢిల్లీ నుంచి సాగించిన కుట్ర ఫలితంగా ఈ ఎన్నిక వచ్చిందన్నారు. రాజగోపాల్ రెడ్డికి రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది కానీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డినే ఒప్పుకున్నారని తెలిపారు. అంటే ఆయనకు బీజేపీ కాంట్రాక్ట్ ఇచ్చినందుకే రాజీనామా చేశానని చెప్పకనే చెప్పారన్నారు. అవినీతిపరులను, స్వార్థపరులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ఒక దుర్మార్గమైన పార్టీ అని రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని చెప్పారు. అనేక మతాలు, కులాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారని కానీ హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని తప్పుడు సిద్ధాంతాన్ని బీజేపీ ముందుకు తీసుకొస్తున్నదని చెప్పారు.