Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దక్షిణ కొరియా తొక్కిసలాట ఘటనను మర్చిపోక ముందే కాంగో రాజధాని కిన్షాసాలో మరో దుర్ఘటన చోటుచేసుకున్నది. కిన్షాసాలో జరిగిన ఓ మ్యూజిక్ కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 11 మంది మరణించారు. ఆదివారం రాత్రి కిన్షాసా స్టేడియంలో ప్రముఖ సంగీత వాద్యకారుడు ఫాలీ ఇపుపా కచేరీలో ఈ తొక్కిసలాట జరిగింది. స్టేడియం వెలుపల ప్రజల్ని చెదరగొట్టేందుకు భద్రతా అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. కిన్షాసా స్టేడియంలో ప్రముఖ మ్యుజీషియన్ ఫాలీ ఇపుపా కచేరీ నిర్వహించారు. ఈ కచేరికి స్టేడియం కెపాసిటీ కన్నా ఎక్కువగా దాదాపు 80 వేల మంది వచ్చారు. కొందరు వీఐపీ, రిజర్వ్‌డ్ సెక్షన్లలలోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకున్నది. స్టేడియం వెలుపల కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉండి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ మొత్తం ఘటనలో ఇద్దరు పోలీసులతోపాటు 11 మంది చనిపోయారు.
పెద్ద సంఖ్యలో మ్యూజిక్ లవర్స్ రావడం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని ముందుగా పసిగట్టలేకపోయారని, అందుకే తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. ఇలాఉండగా, శనివారం సియోల్‌లో జరిగిన తొక్కిసలాటలో 26 మంది విదేశీయులు సహా మొత్తం 153 మంది చనిపోయినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.