Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : స్కూలులో జరిగబోయే భగత్ సింగ్ నాటకం కోసం ఉరి సన్నివేశాన్ని ఓ బాలుడు ఇంట్లో సాధన చేస్తూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రదుర్గకు చెందిన నాగరాజ్ గౌడ, భాగ్యలక్ష్మి దంపతులు తిప్పాజీ సర్కిల్ లో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు సంజయ్ గౌడ(12) బదవానెలోని ఓ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. శనివారం సంజయ్ ఒక్కటే ఇంట్లో ఉన్నాడు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న భాగ్యలక్ష్మి ఎన్నిసార్లు తలుపుకొట్టినా సంజయ్ తెరవలేదు. దాంతో పక్కింటి వాళ్ల సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా సంజయ్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే కిందికి దింపి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్టు తేలింది.
స్కూలులో త్వరలో జరగబోయే వేడుకలలో పాల్గొనేందుకు భగత్ సింగ్ నాటకాన్ని తన కుమారుడు ప్రాక్టీస్ చేస్తున్నాడని మృతుడి తండ్రి నాగరాజ్ తెలిపారు. ఈ క్రమంలో ఉరి వేసుకునే సీన్ ను ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయి ఉంటాడని చెప్పారు. అయితే భగత్ సింగ్ పాత్రలో నటించమని ఏ అబ్బాయిని అడగలేదని చెబుతూ పాఠశాల వారు ఈ వాదనను కొట్టిపారేశారు. బాలుడి మృతి బాధాకరం, అతను భగత్ సింగ్ పాత్రను ఎందుకు రిహార్సల్ చేస్తున్నాడో తమకు తెలియదు అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.