Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం జట్టుతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆటగాళ్లు హోటల్ గదుల్లో ఉంటున్నారు. అయితే
కోహ్లీ తన గదిలో లేని సమయంలో, ఎవరో అతడి గదిలోకి వెళ్లి, అక్కడున్న వస్తువులను వీడియో తీయడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియలో వైరలైంది. ఈ ఘటనపై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దక్షిణాఫ్రికాతో ఆదివారం భారత్ మ్యాచ్ ఆడగా.. ఈ మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్ నగరంలోని క్రౌన్ టవర్స్ హోటల్ లో బస చేసింది. అయితే, కోహ్లీ రూంలో లేని సమయంలో, ఎవరో అతడి గదిలోకి వెళ్లి, అక్కడున్న వస్తువులను వీడియో తీశారు. కోహ్లీ ధరించే దుస్తులు, కళ్లద్దాలు, టోపీలు, బూట్లు, ఇతర వస్తువులన్నింటినీ ఓ ప్రదర్శనగా ఈ వీడియోలో చూపించారు.
తన రూం వీడియో లీక్ కావడం పట్ల కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించిన ఇలాంటి వీడియోలను ఫ్యాన్స్ ఇష్టపడతారన్న విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఈ విధంగా హోటల్ రూంలోకి చొరబడి వీడియో తీయడం చూస్తుంటే మతిపోయింది అని అన్నారు. ఇతరుల ఏకాంతాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఓ వినోద వస్తువుగా చూడడం తగదని స్పష్టం చేశారు.
దీనిపై క్రౌన్ టవర్స్ హోటల్ మేనేజ్ మెంట్ కూడా స్పందించింది. కోహ్లీకి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడినవారిని గుర్తించామని.. వారిని విధుల నుంచి కూడా తొలగించామని స్పష్టం చేసింది. అలాగే ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరుపుతున్నట్టు పేర్కొంది. కోహ్లీ రూం ఫుటేజి ఒరిజినల్ వీడియోను కూడా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించామని క్రౌన్ టవర్స్ వర్గాలు తెలిపాయి.