Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువరూరు, చెంగల్పట్టు, మైలాదుతురై జిల్లాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై సహా పొరుగు జిల్లాలైన కాంచీపురం, తిరువరూర్, చెంగల్పట్టు, మైలాదుతురైలోని పాఠశాలలు, కళాశాలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాల వర్షాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.