Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంతరిక్షంలో భూమితో పాటు అదే కక్ష్యలో తిరుగుతున్న భారీ గ్రహశకలాలు మూడింటిని గుర్తించినట్లు అంతరిక్ష పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ఈ మూడింటిలో ఒకదాని వైశాల్యం 1.5 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. దీనిని 2022 ఏపీ7 అని వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంత భారీగా ఉండే గ్రహశకలాలను ‘ప్లానెట్ కిల్లర్’అంటారని తెలిపారు. ఇంత భారీ గ్రహశకలాలు భూకక్ష్యలో తిరుగుతున్నా ఇప్పటి వరకు గుర్తించకపోవడానికి కారణం సూర్యుడి కాంతి అని తెలిపారు. చిలీ దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించినట్లు ‘ది ఆస్ట్రోనామికల్ జర్నల్’ ఓ కథనాన్ని ప్రచురించింది.
భూకక్ష్యలోనే తిరుగుతున్నప్పటికీ సూర్యుడి కాంతి కప్పేయడం వల్ల ఈ భారీ గ్రహశకలాలను ఇప్పటి వరకూ గుర్తించలేదని పరిశోధకులు చెప్పారు. అయితే, డార్క్ ఎనర్జీ కెమెరా సాయంతో సూర్యుడి కాంతి ప్రభావం తక్కువగా ఉన్న సమయంలో వీటిని గుర్తించినట్లు పేర్కొన్నారు. విండో ఆఫ్ ట్విలైట్ గా వ్యవహరించే ఈ సమయం రోజు మొత్తమ్మీద కేవలం పదినిమిషాలు మాత్రమే ఉంటుందని పరిశోధకులు చెప్పారు. ఆ సమయంలో డార్క్ ఎనర్జీ కెమెరాను ఉపయోగించి ఈ గ్రహశకలాలను గుర్తించామని తెలిపారు.
కక్ష్యలో తిరుగుతూ ఈ గ్రహశకలం క్రమంగా భూ అయస్కాంత క్షేత్రంలోకి చేరుతుందని అంతరిక్ష పరిశోధకులు చెప్పారు. అయితే, భూమికి దగ్గరగా రావడానికి ఎంతకాలం పడుతుందనే విషయంలో స్పష్టతలేదని వివరించారు. 2022ఏపీ 7 గ్రహశకలం భూమిని ఢీ కొట్టే ముప్పు లేకపోలేదని, అలా జరిగితే మాత్రం భారీ విధ్వంసం తప్పదని పేర్కొన్నారు.