Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) గురువారం తెల్లవారుజామున వరంగల్లులో కన్నుమూశారు. నల్లగొండ జిల్లా పరసాయపల్లెకు చెందిన కె.ఎల్.రెడ్డి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1950లో ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన కె.ఎల్.రెడ్డి సూర్యదేవర రాజ్యలక్ష్మి నిర్వహించిన తెలుగు దేశం రాజకీయ వారపత్రికతో తన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభ పేరుతో వారపత్రికను, కాలేజీ విద్యార్థి పేరుతో మంత్లీని స్వయంగా నడిపారు.
1969 నాటి తెలంగాణ ఉద్యమంలో “నేడు” పేరుతో మూడు నెలలపాటు ఒక కరపత్రాన్ని వెలువరించారు. తెలంగాణ ఉద్యమ వార్తలను ఇందులో ప్రముఖంగా ప్రచురించేవారు. అయితే వార్తాపత్రికల రిజిస్ట్రార్ అనుమతి లేకుండా పత్రిక స్థాయిలో “నేడు”ను వెలువరించడం నేరంగా పరిగణించి ఆయనకు నెల రోజులపాటు కఠిన కారగార శిక్ష విధించారు. తెలంగాణ అక్షర యోధుడు పేరిట కె.ఎల్. రెడ్డి గురించి గోవిందరాజు చక్రధర్ ఆంధ్రభూమిలో రాసిన ప్రత్యేక కథనం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఆకర్షించింది. ఆయన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి తన సహాయనిధి నుంచి రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.