Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనచారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా గవర్నర్ కోటా కింద గోరేటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, దయానంద్‌ను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాలు చేస్తూ ధనగోపాల్ అనే వ్యక్తి 2020 లో పిటిషన్ దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగా… 2021 నవంబరులో మధుసూదనచారిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నియమించడంతో మధుసూదనచారిని ప్రతివాదిగా చేర్చాలంటూ ధనగోపాల్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇది అలహాబాద్ హైకోర్టు తీర్పుకు విరుద్దంగా ఉందని అన్నారు. అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్సీల నియామక వ్యవహారం గవర్నర్ విచక్షణాధికారం పై ఉందని దీనికి రాజ్యాంగం అధికారం కల్పించిందని కోర్టుకు వివరించారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మంత్రి మండలి సిఫార్సుతోనే నియామకం జరుగుతుందని.. కౌంటర్ దాఖలు చేశాక పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతిస్తూ మధుసూదనచారికి, గవర్నర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ విచారణను డిసెంబరు నెల 7వ తేదీకి వాయిదా వేసింది.