Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ: జార్ఖండ్‌లోని సంకీర్ణ సర్కార్‌ను అస్థిరపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతల ఇండ్లపై తరచూ దాడులు నిర్వహిస్తున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇండ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన బెర్మొ ఎమ్మెల్యే కుమార్ జైమంగళ్ సింగ్, ప్రదీప్ యాదవ్ ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బెర్మోలని జైమంగళ్ సింగ్ ఇంట్లో మొత్తం 30 నుంచి 35 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారని సమాచారం. ఇక రాంచీ, గద్దాలోని ఎమ్మెల్యే ప్రదీప్ యాదవ్ ఇండ్లలో సోదాలు చేస్తున్నారని తెలుస్తున్నది. వీరితోపాటు బెర్మోకి చెందిన బొగ్గు వ్యాపారి అజయ్ సింగ్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.