Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఎల్ సంతోష్‌లపై కేసులు నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎనిమిది రాష్ట్రాలలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చివేయడంలో తమ పాత్ర ఉన్నదని, అలాగే ప్రధాని, కేంద్ర హోంమంత్రిల పాత్ర ఉన్నదని వీడియోలో మఠాధిపతులు పదే పదే చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ వీడియోల ఆధారంగా ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టడానికి జరిగిన కుట్రపై ఆయా రాష్ట్రాల హైకోర్టులు సూమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ వీడియోలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, అన్ని రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులకు పంపినట్లు సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పెద్దవారైనా, చిన్న వారైనా చట్టం ముందు అందరూ సమానమనని న్యాయవ్యవస్థ సంకేతాలివ్వాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక ఉన్న అందరిపై కేసులు పెట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని కూనంనేని పేర్కొన్నారు.