Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పొరపాటున జనావాసాల్లోకి వచ్చిన చిరుతను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు దానిపై రాళ్లు రువ్వారు. తప్పించుకునే ప్రయత్నంలో అది ఇద్దరిపై దాడిచేసింది. కర్ణాటకలోని మైసూరులో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జనావాసాల్లోకి వచ్చిన చిరుతను చూసిన భవనంపై ఉన్న వ్యక్తులు దానిపై రాళ్లు రువ్వారు. దీంతో బెదిరిపోయిన చిరుత తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డుపైకి పరిగెత్తింది. అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడిచేయడంతో అతడు కిందపడ్డాడు. అది చూసిన మరో వ్యక్తి దానిని అదిలించే ప్రయత్నం చేయడంతో అది అతడిపైకి వచ్చింది. ఈ ఘటనల్లో వారిద్దరూ గాయపడ్డారు. అటవీశాఖ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను షేర్ చేశారు. అప్పటికే ఆందోళనలో ఉన్న చిరుతను వారి మరింత గందరగోళానికి గురిచేశారని, వారికి కనిపించడమే అది చేసిన తప్పు అని నందా ఆవేదన వ్యక్తం చేశారు. చిరుతను చూసిన వారు క్రూరంగా మారడంతో రక్షణ కోసం అది పోరాడిందని అన్నారు. అటవీశాఖ అధికారులు ఆ చిరుతను కాపాడినట్టు పేర్కొన్నారు.