Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాము కాటుతో చిన్నారులు మరణించిన వార్తలు విన్నాం కానీ, ఇప్పుడు చెప్పుకుంటున్నది దీనికి పూర్తిగా విరుద్ధమైనది. ఛత్తీస్ గఢ్ లోని జస్పూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు దీపక్ తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ నాగుపాము (కోబ్రా) అతడి చేతికి చుట్టేసుకుంది. దాన్ని విడిపించేందుకు దీపక్ చేయిని విదిలించాడు. దాంతో పాము కాటేసింది. ఆ తర్వాత కూడా అది ఆ చిన్నారి చేయిని విడిచి పెట్టడం లేదు. దీంతో అతడు కోపంతో చేయిని నోటి దగ్గరకు తీసుకుని పామును రెండు సార్లు కొరికేశాడు. ఈ దెబ్బకు నాగుపాము చనిపోయింది. ఇదే విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తమ కుమారుడిని తరలించారు.
వైద్యులు యాంటీ స్నేక్ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చి, పరిశీలనలో ఉంచారు. కాకపోతే చిన్నారికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. సదరు కోబ్రా చిన్నారిని కాటు అయితే వేసింది కానీ, విషాన్ని విడుదల చేయలేదు. దీన్ని డ్రై బైట్ గా వైద్యులు తేల్చారు. ఒక రోజు పరిశీలనలో ఉంచిన తర్వాత చిన్నారిని ఇంటికి పంపించేశారు.