Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. విజయలక్ష్మి ఏ పార్టీ అభ్యర్థిని వరించనుందోననే ఉత్కంఠకు తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. 8.30 గంటలకు తొలిరౌండ్ లెక్కింపు పూర్తవుతుంది. ఒక్కో రౌండ్ ఫలితం వెలువడటానికి 20-30 నిమిషాలు పడుతుందని అధికారులు తెలిపారు. తుది ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటకు వెలువడుతుంది. ఓట్ల లెక్కింపు జరగనున్న నల్లగొండలోని ఆర్జాలబావి గోదాము వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ హాల్‌లో 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం 298 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంల ఓట్లను లెక్కించేందుకు ఐదు గంటల సమయం పడుతుందని అంచనా. ఉదయం 7.30 గంటలకు ఎన్నికల కమిషన్ పరిశీలకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరిచి.. ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు. ఎన్నికల కమిషన్ ఈటీపీబీఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు(మొత్తం 686) పూర్తికాగానే.. చౌటుప్పల్ మండల ఈవీఎంలను లెక్కిస్తారు. ఆ తర్వాత వరుస క్రమంలో సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 250 మంది సిబ్బంది పాల్గొంటారు. వీరిలో 100 మంది ఓట్ల లెక్కింపులో నిమగ్నమవుతారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారు. వారంతా శనివారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకుడు పంకజ్‌కుమార్, జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదివారం నాటి కౌంటింగ్‌పై సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు.