Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడింది. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. దీంతో పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్య నాయకులందరూ నల్గొండకు చేరుకున్నారు. సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే అనుకూలమని చెబుతున్నప్పటికీ ప్రజల్లో ఎక్కడో ఏమూలో ఉన్న సందేహం వారిని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్లను లెక్కించే హాలులో కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షిస్తాయి. మిగిలిన రెండు చోట్ల రాష్ట్ర పోలీసులు ఉంటారని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాశ్ రాజ్ తెలిపారు. నిన్న నిర్వహించిన మాక్ కౌంటింగ్ విజయవంతమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లను లెక్కించనున్నారు. 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు టేబుళ్లు, ఈవీఎంల లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలలోపు తుదిఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్క్రీన్లపై ప్రదర్శిస్తారు.